విజ్ఞాన సర్వస్వము

విజ్ఞాన సర్వస్వము లేదా విజ్ఞాన కోశము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు.

Brockhaus Lexikon
జర్మన్ విజ్ఞాన సర్వస్వం పుస్తకాల దొంతరలు

లక్షణాలు

విషయ పరిజ్ఞానం, పరిధి, వర్గీకరణ పద్ధతి, ఉత్పత్తి మొదలైనవి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ఏర్పరుస్తాయి.

 • ఇది అన్ని విషయాల గురించిన సమాచారం కలిగి ఉండవచ్చు. ఉదాహరణలు ఆంగ్లంలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, జర్మన్ లో బ్రాక్‌హస్ (Brockhaus) మొదలైనవి. ఇవే కొన్ని జాతులకు, సంస్కృతులకు సంబంధించిన సమాచారం కూడా కలిగి ఉండవచ్చు.
 • ఇవి ఒక రంగంలో ఇప్పటిదాకా కుడగట్టుకుంటూ వచ్చిన ముఖ్యమైన, అవసరమైన సమాచారాన్ని మాత్రమే భద్రపరచవచ్చు.
 • వీటికి ఒక ప్రామాణిక పద్ధతిలో విభజన, వర్గీకరణ కూడా అవసరం
 • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దీనికి సంబంధించిన సమాచార సేకరణ, నిరూపణ, సంక్షిప్తీకరణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

చరిత్ర

ఇప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా భావిస్తున్న వన్నీ 18 వ శతాబ్దంలో నిఘంటువు ఆధారంగా రూపొందించబడ్డవే. చారిత్రకంగా నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు రెండూ విద్యాధికుల చేత వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులచే రాయబడ్డవే. కానీ వాటి కూర్పులో మాత్రం తేడాలున్నాయి. సాధారణంగా నిఘంటువులో అక్షర క్రమంలో అమర్చిన పదాలు, వాటి నిర్వచనాలు, పర్యాయ పదాలు ఉంటాయి. కానీ విజ్ఞాన సర్వస్వంలో ఒక పదం గురించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. ఉదాహరణలు పద వ్యుత్పత్తి, దాని పూర్వాపరాలు మొదలైనవి.

ప్రపంచ విజ్ఞాన సర్వస్వాలు

ప్రపంచంలో ఇదీ మొదటి విజ్ఞాన సర్వస్వం అని ఇదమిత్తంగా చెప్పలేం. కానీ చాలా దేశాల్లో, అనేక భాషల్లో వచ్చిన అనేక విజ్ఞాన సర్వస్వాలకు బ్రిటీష్ వారి 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఆదర్శమని మాత్రం చెప్పవచ్చు.

భారతీయ విజ్ఞాన సర్వస్వాలు

భారతదేశంలో క్రీ.శ.6 వ శతాబ్ధిలో వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత మొదటి భారతీయ విజ్ఞాన సర్వస్వంగా చెప్పవచ్చు. ఆ తర్వాత 12 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు రచించిన అభిలషితార్థ చింతామణిని మరో భారతీయ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చును[1].

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము
తెలుగులో విజ్ఞాన సర్వస్వాలకు మూల పురుషుడుకొమర్రాజు వేంకట లక్ష్మణ రావు. ఆయన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, రాయప్రోలు సుబ్బారావు, మరియుమల్లంపల్లి సోమశేఖర శర్మ ల సహాయంతో తెలుగులో విజ్ఞాన సర్వస్వం కొరకు చేసిన ప్రయత్నం విశేషమైనది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము అనే పేరుతో మూడు సంపుటాలను వెలువరించాడు.
Andhra Vignana Sarvaswamu Vol1 Cover
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1 (కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ) ముఖచిత్రం
Andhra Sarvaswamu Cover
ఆంధ్ర సర్వస్వం
ఆంధ్ర విజ్ఞానము
ఇది ఆరు సంపుటాలలో వెలువడిన విజ్ఞాన సర్వస్వం. దీన్ని దేవిడి జమీందార్ ప్రసాద భూపాలుడు సంకలనం చేసి, 1940 దశాబ్దంలో ముద్రించారు.
ఆంధ్ర సర్వస్వం
ఇది 1943 లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడింది.[2]
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము
మామిడిపూడి వెంకటరంగయ్య గారి సంపాదకత్వంలో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము పేరుతో ఏడు సంపుటాలు 1958-1969 మధ్య కాలంలో ప్రచురించారు.
VignanaSarwasam-Vol4 Darsanamulu-Mathamulu
విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడింది.
తెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగు భాషా సమితి వారు విషయాల క్రమంలో 16 సంపుటాలుగా తెలుగు విజ్ఞాన సర్వస్వం పేరుతో వెలువరించారు. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది.[3]
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం సంపాదకత్వంలో 8 సంపుటాలుగా సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం వెలువడింది. ఖండవల్లి లక్ష్మీరంజనం సంపాదకత్వంలోనే 3 సంపుటాలుగా ఆంధ్రదేశ చరిత్ర, భూగోళ సర్వస్వం వెలువడ్డాయి.

తెలుగు జిల్లాల సర్వస్వాలు

తెలంగాణ జిల్లాల సర్వస్వాలు
1993 నాటికి తెలంగాణ ప్రాంతంలో మూడు జిల్లాలకు మాత్రమే విజ్ఞాన సర్వస్వాలు వెలువడ్డాయి. ఆ తర్వాత విషయాలు వెలుగులోకి రావలసి ఉంది. వెలువడిన వాటి వివరాలు...
 1. నల్లగొండ జిల్లా సర్వస్వం: ఇది 1986లో వెలువడింది. తెలంగాణ ప్రాంతంలో వెలువడిన తొలి జిల్లా సర్వస్వంగా దీనిని పేర్కొనవచ్చును.
 2. ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం: ఇది 1990లో వెలువడింది.
 3. మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం (1993) : ఇది ప్రముఖ పరిశోధకులు బి.ఎన్.శాస్త్రిసంపాదకత్వంలో వెలువడింది. కపిలవాయి లింగమూర్తి, మహ్మద్ హుస్సేన్, గంగాపురం హనుమచ్చర్మ మొదలగువారు ఈ సర్వస్వానికి తమ వంతు తోడ్పాటునందించారు.
రాయలసీమ జిల్లాల సర్వస్వాలు
రాయలసీమ ప్రాంతంలో 1993 నాటికి ఒక జిల్లాకు మాత్రమే సర్వస్వాన్ని వెలువరించినట్లు తెలుస్తుంది.
 1. కడప జిల్లా సర్వస్వం:
తీరాంధ్ర జిల్లాల సర్వస్వాలు
తీరాంధ్ర ప్రాంతంలో రెండు జిల్లాలకు సర్వస్వాలు వెలువడ్డాయి.
 1. గుంటూరు జిల్లా సర్వస్వం
 2. నెల్లూరు జిల్లా సర్వస్వం

అంతర్జాలంలో తెలుగు విజ్ఞాన వేదికలు

TeluguWikipediaFirstPage9Feb2012
తెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు

తెలుగు వికీపీడియా అవతరించకముందు, ఆ తరువాత కొంతమంది ఔత్సాహికులు తెలుగు విజ్ఞాన వేదికలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు

 1. ఆంధ్రభారతి
 2. తెలుపు (తెలుగు పుస్తకాలు)
 3. తెలుగు సాహిత్యము గురించి ఇంగ్లీషు,RTS కోడుతో
 4. తెలుగు వరల్డ్ (ఇంగ్లీషులో)

ఇవీ చూడండి

మూలాలు

 1. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, మనవి, సంపాదకులు:బి.ఎన్.శాస్త్రి, మూసీ ప్రచురణలు,హైదరాబాద్,1993,పుట-iii
 2. ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు
 3. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 4 దర్శనములు-మతములు

బయటి లింకులు

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి

అనాతవరం

అనాతవరం తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1720 ఇళ్లతో, 5785 జనాభాతో 950 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2941, ఆడవారి సంఖ్య 2844. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2056 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 80. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587760.పిన్ కోడ్: 533222.

ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్థులు బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము... అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.

అనిగేరు

అనిగేరు, తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలానికి చెందిన గ్రామము..

ఇది మండల కేంద్రమైన అడ్డతీగల నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 75 ఇళ్లతో, 281 జనాభాతో 370 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 143, ఆడవారి సంఖ్య 138. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 273. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586841.పిన్ కోడ్: 533428.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాల నుండి సమాచారం సేకరించేవారు.

అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో సైన్సు, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు రాశాడు.

"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవుసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాలు పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12న లక్ష్మణరావు మరణించాడు.

అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు. తర్వాత కాశీనాధుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలోప్రచురించాడు.

ఆంధ్ర విజ్ఞానము

విజ్ఞాన కోశము లేదా విజ్ఞాన సర్వస్వము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇది తెలుగులోని తొలినాళ్ల విజ్ఞాన సర్వస్వాలలో ఒకటి. దీన్ని దేవిడి జమీందార్ ప్రసాద భూపాలుడు సంకలనం చేసి, 1940 దశాబ్దంలో ముద్రించారు.

ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము

వరల్డ్ వైడ్ వెబ్ (ప్రపంచ World విశాల Wide అల్లికలవల Web - w.w.w) అనే ఇంటర్నెట్ ద్వారా సమస్త విజ్ఞానాన్ని అందించడాన్నే ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అంటారు. ఇంటర్నెట్ ద్వారా ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించేందుకు గల అవకాశాలను గుర్తించి 1993లో ఇంటర్ పీడియా ప్రతిపాదన చేసింది. ఇంటర్నెట్ ద్వారా విజ్ఞాన సర్వస్వాన్ని సామాజిక అవసరాల కోసం ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరికి అందేలా చేయవచ్చని దీని ఉద్దేశం. ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తున్న ఈ ఆన్ ల నుంచి ప్రముఖ పాత్ర పోషించి విజ్ఞాన సర్వస్వాలను సైతం అధిగమించింది.

ఎస్.బి.రఘునాథాచార్య

ఆచార్య ఎస్.బి.రఘునాథాచార్య రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి 1994-1999 మధ్యకాలంలో ఉపకులపతిగా పనిచేశాడు.

తెలుగు వికీపీడియా

2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాలు చూరగొని వీక్షకుల వలన విజయవంతమై,అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 నాటికి మన వికీపీడియా 5వ స్థానంలో ఉంది.

ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అభివృద్ధి పథంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003, డిసెంబర్ 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా. దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. 2005 నవంబరు 14న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఆ తరువాత "ఈ వారపు వ్యాసాల"గా మారింది. 2007 జూన్ లో (23 వారంలో) మొదటిగా సుడోకు వ్యాసం ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడింది.

2011 లో ఆంగ్ల వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. వాటిలో క్రియాశీలంగా ఉన్న ఎక్కువ మంది తెలుగు వికీ ప్రాజెక్టుల సభ్యులు ముఖాముఖిగా కలుసుకొని వివిధ అంశాలపై చర్చించారు. సాంకేతికాభివృద్ధితో పాటు వికీపీడియాలో అనేక మార్పులు చోటుచేసుకుంటూ ఆధునిక స్మార్ట్ ఫోన్లులో కూడా తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది.

వికీపీడియా సంస్థాగత రూపంలో సాధారణ సభ్యులతో పాటు సభ్యులచే ఎన్నుకోబడిన నిర్వాహకులు, అధికారులుంటారు. కొత్త సభ్యులకు వికీ గురించి నేర్చుకునేందుకు పాఠాలు, సహాయాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. సభ్యులు వికీమీడియా భారతదేశం చాప్టర్ మరియు సిఐఎస్-ఎ2కె సంస్థలతోడ్పాటుతో వికీపీడియా అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా భౌతిక ప్రచారంలో పాల్గొంటారు.

తెలుగు విజ్ఞాన సర్వస్వము

విజ్ఞాన సర్వస్వము అనగా మానవాళికి తెలిసిన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరచిన పుస్తకాలు లేక మాధ్యమాలు. సాధారణంగా విద్యావేత్తలు విజ్ఞాన సర్వాస్వ రచనలో పాలు పంచుకుంటారు. ప్రాచీన కాలంలో ఒక్క పండితుడు విజ్ఞాన సర్వస్వము రాయకలిగినా, తరువాతికాలంలో జ్ఞానము విపరీతంగా అభివృద్ధి కావడంతో, ఒక్కరే ఈ పనిచేయటం కష్టసాధ్యము.

తెలుగు భాషలో పెద్ద బాలశిక్ష మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వము. ఆ తరువాత కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వము ప్రచురణ అయ్యాయి. తెలుగు వికీపీడియా ఆధునిక అంతర్జాల యుగంలో ప్రతిఒక్కరు పాల్గొనగల విజ్ఞాన సర్వస్వము.2004 తరువాత పెద్దబాలశిక్షపేరుతో చాలా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వాటిలో గాజుల సత్యన్నారాయణ సంకలనంచేసిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ప్రజాదరణ పొందింది.

పెద్ద బాలశిక్ష

పెద్ద బాలశిక్ష అనే పుస్తకం తెలుగులో ఎన్సైక్లోపెడియా అనవచ్చు. బ్రిటీషువారు భారతదేశాన్ని పరిపాలించు కాలంలో ఆంధ్రదేశములోని పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

బ్రిటానికా విజ్ఞాన సర్వస్వము

బ్రిటానికా విజ్ఞాన సర్వస్వము ఒక ప్రసిద్ధి చెందిన, ఉచితంగా లభించని విజ్ఞాన సర్వస్వము.

మానసోల్లాస

అభిలాషితార్థ చింతామణి అని కూడా పిలవబడే మానసోల్లాస 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము. సోమేశ్వరుడు 1127 నుండి 1139 వరకు కళ్యాణీ ప్రాంతాన్ని పాలించాడు. ఆ కాలంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉండటము వలన మానసోల్లాసను పొందుపరచుటకు వీలైనది. ఆయన ఎంతో శ్రమతో కళలు, శిల్పశైలి, నృత్యము, సంగీతము, ఆభరణములు, వంటకాలు, పానీయాలు, ప్రేమ, శృంగారము మొదలైన వివిధ విషయాల గురించి సమాచారము సేకరించి ఒక క్రమబద్ధమైన విధంగా సమర్పించాడు.

ఈ గ్రంథము ఐదు వింశతులుగా విభజించబడినది. ఒకొక్క వింశతిలో 20 అధ్యాయములు ఉన్నాయి. మొత్తము గ్రంథాములో వంద అధ్యాయాలు ఉన్నాయి. మానసోల్లాస అనుష్టుప్ ఛందస్సులో రచించబడినది. మధ్యలో అక్కడక్కడ వచనం వాడబడినది. భాష సరళమైనదే కానీ అలంకారభూషితం.

వాల్మీకి

వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం

వికీపీడియా

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమష్టి కృషితో సులభంగా వెబ్ సైటును సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

విజ్ఞానం

అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం మరియు జ్ఞానంల కలయికతో ఏర్పడినదే విజ్ఞానం.

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము తెలుగు భాషలో ప్రచురించబడిన విజ్ఞాన సర్వస్వము (Encyclopedia). దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త మామిడిపూడి వెంకటరంగయ్య గారు వ్యవహరించారు.

మొదటి సంపుటము (అ-ఆర్ష) (906 పేజీలు) : 1958.

రెండవ సంపుటము (887 పేజీలు) : 1960.

మూడవ సంపుటము :

నాలుగవ సంపుటము (784 పేజీలు) : 1964.

అయిదవ సంపుటము (758 పేజీలు) : 1966.

ఆరవ సంపుటము (723 పేజీలు) : 1969.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.