ఆర్థిక శాస్త్రము

సాంఘిక శాస్త్రాలలో ఆర్థిక శాస్త్రము లేదా అర్ధ శాస్త్రము (Economics) ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ సంపద లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన ద్రవ్యంను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం ద్రవ్యంను మాత్రమే కాకుండా ద్రవ్యంతో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాల గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది.

ఆర్థిక శాస్త్రము - పరిచయం

ఆర్థిక శాస్త్రమునకు సమానార్థమైన ఎకనామిక్స్ అనే పదం గ్రీకు పదాలైన ఓకియో, నోమస్ అనే పదాల వల్ల ఏర్పడింది. గ్రీకు భాషలో ఒకియో అనగా గృహము మరియు నోమస్ అనగా చట్టం లేదా శాసనము. ప్రారంభంలో దీనిని గృహ నిర్వహణ శాస్త్రం గానే పిలిచేవారు. కాని రాను రాను ఈ శాస్త్రం యొక్క పరిధి విస్తృతంగా పెరిగిపోయింది.

ఆర్థిక శాస్త్రము - ప్రగతి

ప్రాచీన కాలంలో అర్థ శాస్త్రము

ప్రాచీన కాలం నుంచి ఆర్థిక సమస్యలు మానవ మేధస్సులో కల్గుతున్నాయి. ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు సంపద, వర్తకం లాంటి విషయాలను తమ గ్రంథాలలో వివరించారు. కాని ఒక శాస్త్రంగా మాత్రం ఇది 1776లో స్కాంట్లాండ్ ఆర్థిక వేత్త ఆడంస్మిత్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ అండ్ కాజెస్ ఆప్ ది వెల్త్ ఆప్ నేషన్స్ ప్రచురణతో అభివృద్ధి చెందింది.

కీన్స్ తర్వాతి యుగం

ఆర్థిక శాస్త్రము - విభాగాలు

సూక్ష్మ అర్థ శాస్త్రము

దీనికి ధరల సిద్ధాంతం అని కూడా పేరు. ఇది ముఖ్యంగా సరఫరా, గిరాకీ ల వల్ల ధర ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల ఎంపిక విధానం, తనకున్న పరిమిత వనరులతో గరిష్ట సంతృప్తి చెందే ఎంపిక పద్దతి, వివిధ మార్కెట్లలో వినియోగదారుల, ఉత్పత్తి దారుల ప్రవర్తన, ఉత్పత్తి పద్దతులు, ఉత్పత్తి కారకాలు మొదలగు విషయాలను వివరిస్తుంది.

స్థూల అర్థ శాస్త్రము

ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా జాతీయాదాయం, ఉద్యోగిత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా ద్రవ్య విధానం, కోశ విధానం లాంటి జాతీయ విధానాలను కూడా చర్చిస్తుంది. బ్రిటీష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ గ్రంథం వల్ల స్థూల శాస్త్రము ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి జాన్ మేనార్డ్ కీన్స్ను స్థూల ఆర్థిక శాస్త్రపు పితామహుడుగా పిలవవచ్చు.

ఆర్థిక శాస్త్రము - నిర్వచనాలు

'అర్ధ శాస్త్రము' లేదా 'ఆర్ధిక శాస్త్రము'ను అనేక విధాలుగా నిర్వచించారు[1]. అసలు నిర్వచించే ప్రయత్నమే నిష్ప్రయోజనమని (పారిటో, మిర్డాల్ వంటి) కొందరు భావించారు. స్థూలంగా ఆర్థిక శాస్త్ర నిర్వచనాలు మూడు విధానాలలో ఇవ్వబడ్డాయి.

  1. 'సంపద' (Wealth) ఆధారంగా నిర్వచనం - ఆడమ్ స్మిత్, అతని మార్గీయులది - సంపదను గూర్చిన విధానాల అధ్యయనం ఆర్ధిక శాస్త్రం
  2. 'శ్రేయస్సు' (Welfare) ఆధారంగా నిర్వచనం - ఆల్ఫ్రెడ్ మార్షల్, అతని మార్గీయులది - అర్ధశాస్త్రము మానవుని దైనిక జీవనాన్ని గురించి పరిశీలించే ఒక విజ్ఞాన వర్గము. మానవుని శ్రేయస్సుకు కారణాలైన భౌతిక సాధనాల అర్జన, వినియోగాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల అధ్యయనం
  3. 'కొరత' (Scarcity) ఆధారంగా నిర్వచనం - రాబిన్స్ విధానం - మానవుని (అపరిమితమైన) కోర్కెలకు, వాటిని తీర్చుకొనేందుకు ఉన్న (పరిమితమైన) వనరులు, సాధనాలకు, ఈ నేపధ్యంలో మానవుని ప్రవర్తనకు చెందిన అధ్యయనమే ఆర్ధిక శాస్త్రం

ఆర్థిక శాస్త్రము - సూత్రాలు - సిద్ధాంతాలు

పంపిణీ సిద్ధాంతాలు

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

  1. Economics has suffered more than any other discipline from the malice of polemics about the definition & method - E.R. ఫ్ఘ్A. Seligan.
అమర్త్యా సేన్

అమర్త్య కుమార్ సేన్ (జ. నవంబరు 3 1933, శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు political liberalism లలో చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి 1998లో ఈ ఉన్నతమైన బహుమతి లభించింది.

ఖాతా

తెలుగు లో ఖాతా అనగా అకౌంటు (Account).

గణక శాస్త్రం

గణక శాస్త్రం (ఆంగ్లం: Accounting) అనగా అర్థ సంబంధిత అంశాల ఆర్థిక సమాచారాన్ని కొలిచే, విధానీకరించే మరియు ప్రకటించే ప్రక్రియ. 15వ శతాబ్దపు అంతంలో లూకా పాసియోలి అనే గణిత శాస్త్రవేత్త చే ఈ శాస్త్రం స్థాపించబడినది. వ్యాపార పరిభాష గా పరిగణించబడే గణక శాస్త్రం, సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాల ఫలితాలని కొలవటమే కాక వాటిని పెట్టుబడిదారులకి, రుణదాతలకి, నిర్వాహక వర్గానికి, నియంత్రకాల వంటి వివిధ వాడుకరులకి ప్రకటిస్తుంది. గణక శాస్త్రవేత్తలని Accountants అని వ్యవహరిస్తారు.

చాణక్యుడు

చాణక్యుడు (సంస్కృతం: चाणक्य Cāṇakya) (c. 350-283 BC) మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు.. కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో భోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి, తెలుగులో ఆరమండ్ల వెంకయ్యార్య అనువదించారు

చిట్టాపద్దులు

చిట్టాపద్దులు (ఆంగ్లం: Bookkeeping) అనగా ఆర్థిక లావాదేవీలను నమోదు చేయటం. వ్యాపారం యొక్క గణక శాస్త్రంలో భాగంగా చిట్టాపద్దులు నమోదు చేయబడతాయి. లావాదేవీలలో వ్యక్తిగత లేదా సంస్థాగత అమ్మకాలు, కొనుగోళ్ళు, రసీదులు మరియు చెల్లింపులు ఉంటాయి. చిట్టాపద్దులు రెండు విధాలుగా లెక్కించవచ్చును.

సింగిల్-ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టం

డబుల్-ఎంట్ర్రీ బుక్ కీపింగ్ సిస్టంపై రెండు విధాలు సిసలైన చిట్టాపద్దులుగా చెప్పబడిననూ, ఆర్థిక లావాదేవీలని నమోదు చేసే ఏ ప్రక్రియనైనా చిట్టాపద్దులు అనే అనవచ్చును.

చిట్టాపద్దులు వ్రాసే వ్యక్తి ఒక సంస్థలో ప్రతి ఆర్థిక లావాదేవిని ప్రతి దినము కేటాయింపబడ్డ దస్త్రంలో నమోదు చేసుకొంటూ ఉంటాడు. ఈ లావాదేవీలు అమ్మకాలు, కొనుగోళ్ళు, రశీదులు మరియు చెల్లింపులకి సంబంధించనవై ఉంటాయి. అప్పుడే Accountant ఆర్థిక సంవత్సర అంతంలో తయారు చేసే నివేదికలు సరితూగుతాయి.

నీతి ఆయోగ్

భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి (N.I.T.I.). దీనిని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.

శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది.

పంచవర్ష ప్రణాళికలు

1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. దేశ వనరులు, అవసరాలను రూపొందించేందుకు 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఇంతవరకు మనదేశంలో 11 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 12 వ పంచ వర్ష ప్రణాళిక అమలులో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తాడు, కాగా కేబినేట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మెన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా మాంటెక్ సింగ్ అహ్లువాలియా కొనసాగుతున్నారు.

పరిశ్రమ

పరిశ్రమ (Industry) అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రక్రియనే పారిశ్రామికీకరణ (Industrialization) అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల తలసరి ఆదాయం, వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.

ప్రత్యేక ఆర్థిక మండలి

ప్రత్యేక ఆర్థిక మండలి లేదా సెజ్ (Special Economic Zone or SEZ) అనగా ఏదైన ఒక భూభాగంలో దేశమంతటా వర్తించే ఆర్థిక నియమాలు కాక కొన్ని సడలింపులను కలిగి ఉంటాయి. వీటిని

మన రాష్ట్రంలో వీటి స్థాపన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చేపడుతుంది.

అక్టోబరు 2010 సంవత్సరాంతానికి మన దేశంలో 114 సెజ్ జోన్లు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాలలో విస్తరించాయి.:

కర్ణాటక - 18

కేరళ - 6

చండీఘడ్ - 1

గుజరాత్ - 8

హర్యానా - 3

మహారాష్ట్ర - 14

రాజస్థాన్ - 1

తమిళనాడు - 20

ఉత్తర్ ప్రదేశ్ - 4

పశ్చిమ బెంగాల్ - 2

ఒడిషా - 1

బడ్జటు

బడ్జటు అను పదం ప్రస్తుతం ఆదాయ వ్యయాల ప్లానింగునకు చిన్న కుటుంబము నుండి పెద్ద దేశం వరకూ ఉపయోగిస్తున్నారు.

దీనికి వెనక ఓ చిన్న కథ ఉన్నది!

అసలు ఈ బడ్జటు అను పదం bhelgh- అను ఇండో యూరోపు మూల పదంనుండి వచ్చినది, దీనికి అర్థము లావుగా, ఉబ్బెత్తుగా ఉండటం, bulge అను పదం కూడా ఇదే మూల పదం నుండి వచ్చినది, బడ్జటు అనునది లావుగా ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఓ సంచీ, బ్యాగు అన్నమాట!

వెనకటికి బ్రిటనులో ప్రతిసంవత్సరం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు పార్లమెంటులో వారి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేటప్పుడు ఇటువంటి సంచీలోనే చాలా జాగ్రత్తగా ఆ కాగితాలు తీసుకోని వచ్చేవారు, అప్పటినుండి ఇటువంటి ఆదాయ వ్యయాలను బడ్జటు అని పిలవడం మొదలుపెట్టినారు!

భారత ప్రణాళికా సంఘం

భారత ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా మార్చి 15 1950 న ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ. ఇది రాజ్యాంగేతర మరియు శాసనేతర సంస్థ. దీనికి ఛైర్మన్ గా ప్రధాన మంత్రి, క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకుడిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు.

రూపీ

ద్రవ్య సంబంధమైన కొలమానానికి కొన్ని దేశాలలో వాడబడుతున్న సాధారణ నామం రూపీ. భారతదేశానికి సంబంధించిన రూపీని తెలుగులో రూపాయి అంటారు. భారతదేశం పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు, ఇండోనేషియా ద్రవ్య కొలమానానికి సాధారణ నామంగా రూపీని ఉపయోగిస్తున్నారు. పూర్వం బర్మా, ఆఫ్గనిస్తాన్లలో కూడా ద్రవ్య కొలమానానికి రూపీని సాధారణ నామంగా ఉపయోగించారు. చారిత్రాత్మకంగా రూపీని మొట్టమొదట సుర్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు షేర్ షా సూరి 16 వ శతాబ్దంలో పరిచయం చేశాడు. ఈ రూపీ పదం రుపయా అనే పదం నుండి వచ్చింది. వెండి నాణెం యొక్క సంస్కృత పదం రుపయా.

లాభం

లాభం (ఆంగ్లం Profit) అనగా ఆర్థికశాస్త్రరీత్యా ధనం అధికంగా రావడం.

వడ్డీ

వడ్డీ : (ఆంగ్లం : Interest లేదా Usury )

వడ్డీ ఒక రుసుం లేదా ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్‌జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం. లేదా, డిపాజిట్టు చేసిన రొక్కములకు ప్రతిగా పొందే ఫలము. కొన్ని అసళ్ళు అయిన రొక్కము, షేర్లు, కోనుగోలుదార్ల సరకులు, అడమాణము, తాకట్టు (hire purchase), ఫైనాన్సు లీజులు వగైరాలు కూడా ఈ వడ్డీని కలిగివుంటాయి. మనమేదైనా బ్యాంకు నుండి రుణసహాయం పొందాలంటే, వాటికి అసలు మరియు వడ్డీ చెల్లించవలసినదే. పోలీసులుగుర్తించిన తొమ్మిది ప్రధానమైన ఆర్థిక నేరాలలో వడ్డీ వ్యాపారం ఒకటి.

వస్తుమార్పిడి పద్ధతి

వస్తుమార్పిడి పద్ధతి అనగా ద్రవ్యం లేని కాలంలో ఒక వస్తువు బదులు మరో వస్తువు ఇచ్చిపుచ్చుకునే ఒక పద్ధతి. ఆ కాలంలో మన దగ్గర ఉండే వస్తువును ఇచ్చి మనకు అవసరమైన మరో వస్తువును అవి ఉన్నవారి దగ్గర నుండి తీసుకోవడం.

సరఫరా మరియు గిరాకీ

సరఫరా మరియు గిరాకీని ఆంగ్లంలో సప్లై అండ్ డిమాండ్ అంటారు. సరఫరా మరియు గిరాకీ మార్కెట్లో ధర నిర్ణయం యొక్క ఒక ఆర్థిక పద్ధతి. పోటీ మార్కెటులో యూనిట్ ధర సరఫరా పరిమాణం మరియు గిరాకీ పరిమాణం సమానంగా ఉన్న చోట స్థిరపడుతుంది. ప్రస్తుత ధర వద్ద వినియోగదారులు ఉత్పత్తి అయిన యూనిట్ల మొత్తాన్ని వినియోగిస్తుండగా, ఉత్పత్తిదారులు వినియోగదారులకు అవసరమయిన యూనిట్ల మొత్తాన్ని ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ఫలితం ధర మరియు పరిమాణం యొక్క ఆర్థిక సమతౌల్యం.

సరఫరా మరియు గిరాకీ యొక్క నాలుగు ప్రాథమిక చట్టాలు:

1. గిరాకీ పెరుగుతుంది మరియు సరఫరా మారదు, అప్పుడు ఇది అధిక సమతుల్యతా ధరకు మరియు అధిక పరిమాణంకు దారితీస్తుంది.

2. గిరాకీ తగ్గుతుంది మరియు సరఫరా మారదు, అప్పుడు ఇది తక్కువ సమతుల్యతా ధరకు మరియు తక్కువ పరిమాణంకు దారితీస్తుంది.

3. గిరాకీ మారదు మరియు సరఫరా పెరుగుతుంది, అప్పుడు తక్కువ సమతుల్యతా ధరకు మరియు ఎక్కువ పరిమాణంకు దారితీస్తుంది.

4. గిరాకీ మారదు మరియు సరఫరా తగ్గుతుంది, అప్పుడు అధిక సమతుల్యతా ధరకు మరియు తక్కువ పరిమాణంకు దారితీస్తుంది.

సూక్ష్మ అర్థ శాస్త్రము

ఆర్థిక శాస్త్రములో వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేయు శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం (Microeconomics). ఆర్థిక శాస్త్రము లోని చిన్న చిన్న భాగాల గురించి ఇది వివరిస్తుంది. ఒక వైయక్తిక వినియోగదారుడు గురించి, ఒక పరిశ్రమ గురించి, డిమాండు, సప్లై ల మార్పుల గురించి ఇది వివరిస్తుంది. రాగ్నర్ ప్రిష్ అనే ఆర్థిక వేత్త స్థూల ఆర్థిక శాస్త్రము ప్రారంభించడంతో సూక్ష్మ ఆర్థ శాస్త్రము అనే విభాగం ప్రత్యేకంగా వెలిసింది.

సూక్ష్మ అర్ధశాస్త్రాన్ని సామాన్యంగా ధరల సిద్ధాంతము (Price Theory) అని కూడా అంటుంటారు. ఒక వినియోగదారుడు తన సంతృప్తిని ఏ విధంగా గరిష్ఠం (వీలయినంత ఎక్కువ) చేసుకొంటాడో, ఒక సంస్థే విధంగా గరిష్ఠలాభాలను పొందుతుందో నిర్ణయించే సూత్రాలు ఈ విభాగం పరిధిలోనికి వస్తాయి. - ఏ వస్తువులు ఉత్పాదన చేయాలి? ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి? సాధనాల కొరత ఎలా ఉంది? సాధనాల కేటాయింపు ఎలా జరగాలి - వంటి విషయాలకు ఈ విభాగంలో ప్రాముఖ్యత లభిస్తుంది.

స్థూల ఆర్థిక శాస్త్రము

ఆర్థిక శాస్త్రములో స్థూల ఆర్థిక శాస్త్రము ఒక విభాగం. వైయక్తిక యూనిట్‌లను కాకుండా యూనిట్‌ల సముదాయాలను మొత్తంగా అధ్యయనంచేస్తుంది. (వైయక్తిక యూనిట్‌లను అధ్యయనం చేసేవిభాగాన్ని సూక్ష్మ అర్థ శాస్త్రము అంటారు).

వ్యక్తుల విడి విడి ఆదాయాల గురించి కాకుండా మొత్తంజాతీయాదాయం, సాధారణ ధరల స్థాయి, జాతీయ ఉత్పత్తి వంటి వివరాల అధ్యయనం స్థూల ఆర్థిక శాస్త్రంలో జరుగుతాయి. స్థూల ఆర్థిక శాస్త్రాన్ని ఆదాయ-ఉద్యోగితా సిద్ధాంతమనీ, ఆదాయ సిద్ధాంతమనీ కూడా అంటారు. నిరుద్యోగ సమస్య, ఆర్థికపరమైన ఒడిదుడుకులు, అంతర్జాతీయ వ్యాపారము, ఆర్థిక అభివృద్ధి, ధరల స్థాయిపై ద్రవ్యరాశి ప్రభావం వంటివి ఈ అధ్యయనం పరిధిలోకి వస్తాయి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.